Editorial : 2029 కూటమితోనా..కొత్త ప్రభుత్వమా??
2024 ఎన్నికల ఫలితాల వేడి ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితే తీసుకుంటే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయాన్ని అందుకున్న వైసీపీ పార్టీ 2024 లో మాత్రం 11 సీట్లకు పరిమితం అవ్వాల్సి వచ్చింది, కారణాలు ఏమైనా ప్రజలు మాత్రం తమ తీర్పును కూటమికి మద్దతుగా ఇచ్చారు.

ఇదిలా ఉంటే కొత్త సర్కార్ కొలువుదీరి దాదాపుగా 5 నెలలు కావొస్తుంది, మరో పక్క ఇచ్చిన హామీల లెక్క చాలానే ఉంది. మరి గత 5 నెలలుగా కూటమి చేసిన మార్పులు, గత ప్రభుత్వానికీ ఈ కొత్త కూటమి సర్కార్ కి వ్యత్యాసం కాస్త గమనిస్తే.
ప్రజా క్షేత్రం నుంచి వినిపిస్తున్న వాదన ప్రకారం కూటమి పార్టీలకి పాలన కత్తి మీద సాము లాగానే కనిపిస్తుంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో తలమునకలై ఉంది ఈ సర్కార్. ఇచ్చిన హామీలను అమలులోకి ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అదీ కాక గత ప్రభుత్వ పాలనలో అభివృద్ది లెక్కల్లో రాష్ట్రం పెద్దగా పుంజుకోకపోవడం , కొత్త కంపెనీలు, పెట్టుబడులు పెద్దగా రాష్ట్రానికి రాకపోవడంతో ఆ ఆర్థిక భారం ఇప్పుడు ఈ కూటమి సర్కార్ పై స్పష్టంగా పడుతుంది. ఇక ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాల లెక్కలు ప్రభుత్వ అసమర్ధతను నిత్యం ప్రశ్నిస్తునే ఉన్నాయి.
ఇదిలా ఉంటే మరోపక్క 2024 లో వైకాపా పార్టీ ఓటమి పాలైనప్పటికీ దాదాపుగా 40% ఒట్లు తెచ్చుకుని బలంగానే తన ఉనికిని చాటుకుంది. అయితే ఆ పార్టీ హయాంలో ఎదురు తిరిగి మాట్లాడిన వారిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వరుస కేసులతో నాడు పరిది దాటి మాట్లాడిన వారు జైళ్ళ పాలు అవుతున్నారు. అదే క్రమంలోనే వైఎస్ జగన్ కి ఇంటి పోరు సైతం మరింత భారంగా మారడం, ఇక అయన పై ఉన్న అవినీతి కేసుల చిట్టా, ఆయన హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలు అన్నీ వెరసి ఆ పార్టీని, ఆ పార్టీ భవిష్యత్తుని సంధిగ్ధంలోకి నెడుతుంది అని చెప్పక తప్పదు.
అయితే ఇటు కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా అటు రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చెయ్యడం, కొత్త కంపెనీలు తెచ్చి భారీగా ఉద్యోగ కల్పన, ఇలా ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన వాటిల్లో పురోగతి చూపించగలిగితే, ఇచ్చిన హామీలను అత్యధికశాతం నెరవేర్చగలిగితే 2029 నాటికి ప్రజలు మరోమారు కూటమికే మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉంటాయి.
అయితే ప్రతిపక్ష హోదా సైతం దక్కించుకోలేని స్థితిలో ఉన్న వైసీపీ పార్టీ సైతం పుంజునుని మరోమారు అధికారం దక్కించుకోవాలి అంటే భారీ కసరత్తే చెయ్యాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా నిత్యం ప్రజల్లోనే ఉండి, అధికారపక్షం చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ, ప్రజల తరపున పోరాటం చేస్తే ఖచ్చితంగా ప్రజలు తమ కోసం ఆలోచించే నాయకత్వానికి, తమకు అండగా నిలిచిన వైకాపాకి మరోమారు మద్దతు ప్రకటించే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉంటే 2029 కి ఇరు పార్టీలకూ నాయకత్వ లోటు కనిపించే అవకాశమూ లేకపోలేదు. ఆ సమయానికి చంద్రబాబు దాదాపుగా 80 ఏళ్ల కు చేరడం, యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటారో లేదో అన్న అనుమానాలు క్యాడర్ లో ఉండడం, అదే క్రమంలో యువగళం అనుభవంతో చంద్రబాబు తరువాత పార్టీని నడిపించే సత్తా లోకేష్ లో కనిపిస్తున్నా, చంద్రబాబు స్థాయిని చేరుకోవడానికి లోకేష్ కి చాలా సమయం పట్టవచ్చు. ఇక ఇటు వైకాపా పరిస్థితే తీసుకుంటే అన్నీ తానై నడిపిస్తున్న జగన్ తనపై ఉన్న అవినీతి ఆరోపణలు రుజువై ఆయన జైలుకు వెళితే ఆ పార్టీ భవిష్యత్తు సూన్యం అన్న భయం సైతం క్యాడర్ లో కనిపిస్తుంది.
మరి ఇన్ని అవాంతరాల మధ్య, అన్ని పెను సవాళ్ళ మధ్య
కూటమి మరోమారు 2029 లో తమ అధికార ప్రతాపాన్ని కొనసాగిస్తుందో లేక అమెరికా లో బూమరాంగ్ లాగా ట్రంప్ దూసుకు వచ్చినట్లు జగన్ దూసుకు వస్తారో చూడాల్సి ఉంది.

Valid Editorial. 2029 will be tough for both the parties based on their performance for next 5 years.
ReplyDelete